Thursday, 11 August 2016

యేసుక్రీస్తు ప్రభువు వారు భూమిమీద మనిషిగా  వున్నప్పుడు ఏమైనా పాపం చేశాడా?


    ఆయన పాపం చేసాడు అని ఎవరైనా అంటే నేనైతే  నమ్మను. ఎందుకో వివరిస్తాను.  మనం మొదటిగా ఒకటి తెలుసుకోవాలి, యేసుక్రీస్తు వారు సంపూర్ణ మనిషి అలాగే  సంపూర్ణ దేవుడు.  అయన మనిషిగా మారినప్పటికీ అయన దేవుడుగా కూడా వున్నాడు.  (కొలొస్స  2:9)(ఫిలిప్పు  2:5-8). దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు,  ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడునేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.  (యాకోబు  1:13), కాబట్టి యేసు పాపము విషయమై శోదించబడలేదు, ఎందుకంటే ఆయన దేవుడు. 

     దీన్ని ఇంకొంచం వివరంగా తెలుసుకుందాం.  యేసుక్రీస్తు వారు కూడా శోదించబడ్డారని మనకు తెలుసు. (హెబ్రీ  2:18)(హెబ్రీ  4:15).  ఈ శోధనను గురించిన వివరణ మనకు (మత్త  4:1-11)లో కనిపిస్తుంది.  శోధకుడు (సాతాను) యేసును శోధించడానికి అరణ్యానికి తీసుకెళ్లాడు.  సాతాను యేసును మూడు విధాలుగా శోదించాడు.  1యోహాను  2:16 లో చెప్పబడిన విదంగా మనుషులందరూ శరీరాశ (మత్తయి  4:1-4) నేత్రాశ (మత్త  4:8-11) జీవపు డంబము (మత్త  4:5-7) అను మూడు  విషయములో శోదించబడతారు.  యేసు శోధనలకు  లొంగిపోలేదు కానీ ద్వితీయోపదేశ కాండము లోని వచనాలు ద్వారా "ఇలా  రాయబడినది, ఇలా రాయబడినది" అని సమాధానమిచ్చి శోధనను జయించాడు.  
     యేసు శోదించబడినను ఆయన పాపము లేని వాడిగా భూమి మీద జీవించాడు.  (2 కొరింతి  5:21)(1 పేతురు  2:22)(1 యోహాను  3:5), శోదించబడడం పాపం కానేకాదు. యేసు భూమి మీద ఉన్నపుడు మనలాగే శరీర విషయాల మీద శోదించబడ్డాడు.  ఎప్పుడైతే మనము ఒక శోధన గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటామో, అప్పుడు ఆ శోధన మనకు పాపంగా మార్చబడుతుంది.   (యాకోబు  1:15-16). యేసు "దేవుడు" కాబట్టి అయన ఎలాంటి  బాహ్య శోధనకు తావివ్వలేదు. 
     దీన్ని అర్ధం చేసుకోవడానికి ఒక ఉదాహరణను ఇక్కడ ఇస్తున్నాను. రకరకాల ప్రజలు రకరకాల  శోధనలకు లొంగిపోతారని మనకు తెలుసు. కరక్టే కదా! ఒక స్త్రీ "బికినీ" దుస్తులు ధరించి ఉంది అనుకోండి.  ఈమెను ఇంకొక స్త్రీ  చూసింది. ఈ రెండవ స్త్రీ ఆ "బికినీ" ధరించిన మొదటి స్త్రీని చూసి ఏమైనా శోదించబడుతుందా? ఏమాత్రం శోదించబడదు. (ఒకవేళ ఆమె హోమోసెక్సుల్ అయితే తప్ప ). ఇదే స్త్రీని ఒక పురుషుడు చూస్తే శోధనకు గురై , పాపపు తలంపులు వచ్చే  అవకాశాలు చాలా ఎక్కువ. ఇదే విషయాన్ని మనం అనేక పరిస్ధితుల  మీద  ఆలోచించవచ్చు. ఒక స్మోకర్ సిగరెట్ ను చూసిన, లేక సిగరెట్ పొగ వాసన పీల్చినా శోదించబడతాడు , ఇదే సిగరెట్,  స్మోకింగ్ అలవాటు లేని వాడిమీద ఎలాంటి ప్రభావం చూపించలేదు.  మత్తు పానీయాలు కూడా కొందరికి శోధన, కొందరిని  ప్రభావితం చేయలేవు. 
    యేసుక్రీస్తు విషయములో కూడా ఇది చాలా కరెక్ట్. అనేక శోధనలు అయన మీదకు వచ్చాయి. కానీ అవేమి ఆయను ప్రభావితం చేయలేక పోయాయి.  వాటికి అంతరంలో అయన చనిపోయాడు.  సాతానుకు యేసుక్రీస్తు వారి మీద ఎలాంటి అధికారం లేదు. (యోహాను  14:30). యేసుక్రీస్తు వారి యొక్క ఒకే ఒక ఆశ "తండ్రి యొక్క చిత్తం చేయడం ద్వారా తండ్రిని  సంతోషపరచటం".  (మత్త  26:39)(లూకా  22:42)(యోహాను  4:34)(యోహాను 5:30)(యోహాను 6:38)(యోహాను 8:29). మనకు కూడా ఇలాంటి ఆశ ఉంటే మనం కూడా పాపానికి ఎలాంటి చోటు ఇవ్వకూడదు. 

No comments:

Post a Comment