Tuesday, 16 August 2016

      నరకమనేది భూమికి మధ్యన వుందా?

బైబిల్ దీని గురించి ఏమి మాట్లాడడం లేదు. కానీ కొన్ని రుజువులు ఉన్నాయి. కానీ ఉండవచ్చు అనేదానికి కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. 
నరకమంటే బైబిల్ ఏమి చెప్తుందంటే  . 
అగ్నిగుండము  - (మత్త  13:42,50)
నిత్యాగ్ని  - (యూదా  1:7)
ఆరని అగ్ని  - (మత్త  3:12)(లూకా  3:17)
నిత్యాగ్ని - (మత్త  25:41)
ఆరని అగ్ని  - (మార్కు  9:43-48)
     నరకము యొక్క దిశ గురించి బైబిల్ చెప్పేదేమిటంటే 
(మత్త  12:40) "మనుష్య కుమారుడు మూడు పగళ్లు మూడు రాత్రుళ్ళు భూగర్భములో ఉన్నాడు" 
(ఎఫెసీ  4:9) "(భూమి యొక్క క్రింది భాగములు  (కీర్తన  63:9)
(ఆమోసు  9:2)  "పాతాళము "
(యెషయా  14:9) "క్రింద నున్న నరకం " (సామెత  15:24)
(యెషయా  14:15) "పాతాళమునకు, నరకములో ఒక మూలకు "
(యెహేజ్కెలు  31:16) "పాతాళము"
యెహేజ్కెలు 31:17) "పాతాళము " (యెహేజ్కెలు  32:27)
(2 పేతురు  2:4)  "దూతలను నరకములో ఉంచెను. "
(ప్రకటన 5:3) "భూమి క్రింద "
 పై   రెండు విషయాలు "భూమి యొక్క మధ్యభాగము" ను తెలియజేస్తున్నాయి.   భూమి 4 పొరలతో చేయబడినది. దుమ్ము, రాళ్లు, పై పొర, క్రింది పొర. లోపలి పొర గట్టి పదార్దాలతోను, వెలుపటి పొర లోహముతో కూడిన ద్రవము. ఇక్కడ ఉష్ణోగ్రత 7000 - 9000 ఫారెన్ హీట్ ఉంటుందని అంచనా. ఇది బైబిల్ చెప్పే నరకానికి సరిపోతుందని అంచనా. ఇది భూమికి   మధ్య   భాగం ( 3959 మైళ్ళు దూరం)  అని అంచనా. 
  
     ఇక్కడ (సంఖ్యా 16:30-33) ప్రకారం భూమి నోరు తెరచి వారిని మ్రింగివేసింది. వారు (33వచనం) ప్రాణములతోనే పాతాళములో కూలిరి. భూమి నోరు తెరిస్తే పాతాళం వస్తుంది అని ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. 
     
(కీర్తన  55:15) లో దావీదు అడుగుచున్నాడు. "నా శత్రువులను సజీవులనుగానే పాతాళములోనికి పంపుము."
    బైబిల్ ఈ విషయములో నిశ్శబ్దంగా వుంది కాబట్టి ఇది ఒక అవకాశమే గాని ఇక్కడే వుంది అని బల్లగుద్ది చెప్పలేం. ముఖ్యముగా దేవునితో నిత్యమైన ఎడబాటు   (2 థెస్స   1:9)(ప్రకట  21:27). ఇది భరించలేనిది. కాబట్టి  నరకం సంగతి ప్రక్కన పెట్టి  యేసుక్రీస్తు నందు విశ్వాసముంచు. నరకం నుండి తప్పించుకో. 

నీతిమంతులుగా తీర్చబడుట , పరిశుద్దులుగా మార్చబడుట , మహిమ పరచబడుట అంటే ఏమిటి?  

నీతిమంతులముగా తీర్చబడుట:     

ప్రతి మనిషి ఈ భూమి మీద పాపి అని బైబిల్ చెప్తుంది. (1 యోహాను  1:8,10)(రోమా  3:10,23) (ప్రసంగి  7:20)(1 రాజులూ  8:46). ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు  (1 పేతురు  1:16)(యెషయా  57:15)(లేవి  20:26)(లూకా  1:49), అయన పాపాన్ని చూడలేదు.  (హబక్కుక్  1:13). తండ్రియైన దేవునితో మనకు సహవాసం  కావాలంటే  పాపంలేని పరిశుద్ధ జీవితం అవసరం.  ఇది మనం ఎప్పటికి చేరుకోలేము కాబట్టి  యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పరిశుద్ధంగా, నీతిగా, యదార్ధముగా జీవించాడు.  చివరగా అయన సిలువపై చనిపోయాడు.  మన పాపాలకు ప్రాయశ్చిత్తం కొరకు అయన సిలువపై రక్తం చిందించాడని బైబిల్  చెప్తుంది  (కొలొస్స  1:14)(ఎఫెసీ  1:7)(హెబ్రీ  10:16-19)(1 యోహాను  1:7)(ప్రకటన  1:5). 
     యేసు సిలువ మీద ఉండగా రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాడు. మొదటిది (మత్తయి  27:46)( 15:34)   "నా దేవా దేవా నన్నెందుకు చేయి విడచితివి" అనేది.  సర్వలోక పాపాలు అయన మీద మోపబడినప్పుడు , అయన తండ్రి నుండి వేరుచేయబడ్డాడు కాబట్టి తన జీవితములో మొట్టమొదటి సారి తండ్రిని ప్రశ్నించాడు.  రెండవది  "సమాప్తమైనది" (యోహాను  19:30) అని చెప్పాడు. ఈ సమయములో యేసుక్రీస్తు వారు చేయవలసిన "పాప పరిహారం" సమాప్తమైనది కాబట్టి  తన ఆత్మను తండ్రికి అప్పగించి చనిపోయాడు. ఇదే నీతిమంతులముగా తీర్చబడుట అంటే. 
     
     నీతిమంతులముగా తీర్చబడుట అంటే,   ఒక మనిషి  తను  చేసిన ఎలాంటి మంచి పనుల ద్వారా కాకుండా కేవలం యేసుక్రీస్తు సిలువ బలియాగంనందు విశ్వాసం  ద్వారా మాత్రమే దేవుని కన్నుల ఎదుట  నీతిమంతుడుగా తీర్చబడుట.  (గలఁతి  2:16)(రోమా  3:28)(రోమా  4:4-5)(గలఁతి  5:4),  మనిషి కేవలం యేసుక్రీస్తు నందు విశ్వాసం ద్వారా కృప చేతనే నీతిమంతుడుగా తీర్చబడుట. (రోమా  3:24)  (రోమా  5:1)(గలతీ  3:24)(1 కోరింతి  6:11). ఎప్పుడైతే మనం క్రీస్తునందు విశ్వాసముంచుతామో ఆ క్షణమే క్రీస్తు యొక్క నీతి, పరిపూర్ణత, పాప రహితమైన స్థితి మనకు అనుగ్రహించబడుతుంది.   (2 Cor 5:19,21)లో చెప్పబడిన రీతిగా దేవుడు పాపమెరుగని క్రీస్తు ద్వారా లోకమును తనతో సమాధాన పరచుకోవాలనుకున్నాడు.    (దీన్ని కూడా చూడండి. : రోమా  4:7-8,24-25)  మన పాపములు రద్దు చేయబడినవి, క్షమించబడినవి. ఆ క్షణం నుండి యేసుక్రీస్తు ద్వారా తండ్రియైన దేవునితో సదా కాలము మనం సహవాసము కలిగి ఉండవచ్చు.   (యోహాను  14:6)(మత్తయి  11:27)(హెబ్రీ  10:19-20).
    

పరిశుద్ధపరచ బడుట: 


    పరిశుద్ద పరచబడుట అనే పదం ""hagiazo" అనే గ్రీకు పదం ద్వారా వచ్చింది. దీని అర్ధం " పరిశుద్ద పరచబడుట" లేక "దేవుని కోసం వేరుగా ఉండుట".  మనం నీతిమంతులముగా తీర్చబడిన తర్వాత "పరిశుద్ధపరచబడుట" మొదలవుతుంది. పైన చెప్పబడిన విదంగా "నీతిమంతులముగా" తీర్చబడుట  ఒక క్షణంలో జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ కాదు. ఇంకొక వైపు "పరిశుద్ద పరచబడుట" అనేది నిరంతర ప్రక్రియ . మనం నీతిమంతులముగా తీర్చబడిన తర్వాత మరింత పరిశుద్ధత కొరకు పరిశుద్ధ పరచబడే  ప్రక్రియను ఆరంబించాలి.  (1 పేతురు  1:15-16)(1థెస్స  4:7)(లేవి  11:44-45).
     మనం నీతిమంతులముగా తీర్చబడిన మరుక్షణం దేవుడు పరిశుద్ధ ఆత్మ రూపములో మనలో కొస్తాడు. (ఎఫెసీ  1:13-14)(ఎఫెసీ  4:30)(2 కొరింతి  5:5)(2 కొరింతి 1:22). మరింత పరిశుద్ధలోనికి మారడానికి పరిశుద్దాత్మ దేవుడు సహాయ పడతాడు.  (2 థెస్స  2:13)(1పేతురు  1:2) మన జీవితములో పాపములన్నియు చూపిస్తాడు. అంతేకాక  యేసుక్రీస్తు  (1 కొరింతి  1:2)(అపో  26:18)(హెబ్రీ  2:11)(హెబ్రీ  10:10) మరియు తండ్రియైన దేవుడు కూడా మనకు సహాయపడతారు. (యూదా  1:1) . ఈ ప్రక్రియ కొన్నిసార్లు చాల నొప్పి, బాధను కలిగించవచ్చు. కానీ ఇది దేవుడు ఆయనకు మనమీద వున్నా ప్రేమతో చేస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాక మనం భరించలేని దాని కంటే ఎక్కువ మనకు  ఇవ్వదు.   (1 కొరింతి  10:13).
   తండ్రి , కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు  మనకు  సహాయం చేస్తున్నప్పటికీ పరిశుద్ధత విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది మనమే ( 2 తిమోతి  2:21)(హెబ్రీ  12:14). దేవుని వాక్యమును బాగా చదవాలి  ఇదే మంచి చెడులను గురించి తెలియచేస్తుంది. ఈప్రక్రియ మన జీవితకాలమంతయు కొనసాగుతుంది.  మరియు మనము వివిధ దశలలో శుద్దిచేయబడతాము, విశ్వాసముతో ఎదుగుతాము. మన లక్ష్యం ఏమిటంటే   రోజు రోజుకి క్రీస్తు వలే మార్పుచెందడం.  (ఎఫెసీ  4:13.15)(ఫిలిప్పి  3:12-14)(2 కొరింతి  3:17-18)( రోమా  8:29).
       ఇది మీ జీవితంలో జరుగుతుందా? నిన్నటి కంటే ఈరోజు మరింత పరిశుద్ధంగా జీవించావా? పోయిన సంవత్సరము కంటే ఈ సంవత్సరము  ఎక్కువగా పరిశుద్ధంగా జీవించావా? లేదంటే  మీరు ఆత్మీయంగా ఎదగడం లేదు?" దేవుడు మీ కోసం సిద్ధం చేసిన వాటిని మీరు పోగొట్టుకొంటున్నారు. .
     ఈ ప్రక్రియ మహిమ పరచబడడంతో ముగుస్తుంది.  ఇది క్రింద వివరించడం జరిగింది. 

మహిమ పరచబడుట :

 మహిమపరచబడడం అనేది ఈ ప్రక్రియలోని మూడవ  చివరి భాగము.   ఈ ప్రక్రియ నీతిమంతునిగా తీర్చబడుటతో ఆరంబించబడి, రోజు రోజుకి అధికమైన పరిశుద్ధతలో ప్రవేశిస్తూ  మహిమ పొందడంతో ముగుస్తుంది.  
     మహిమపరచబడుట అనేది  యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో జరుగుతుంది.(1 కొరింతి  15:50-54). ఆ సమయమున  ఆరంభమునుండి ఇప్పటివరకు విశ్వాసులుగా వున్నవారికి ఒక నూతనమైన, పరిపూర్ణమైన, మహిమ కరమైన శరీరం ఇవ్వబడుతుంది.  (ఫిలిప్పి  3:20-21)(రోమా  8:23). బైబిల్ చెప్పేదేమిటంటే  మొదట,  చనిపోయి పరలోకములో వున్నవారు మహిమ దేహములు ధరిస్తారు. ఆ తర్వాత సజీవులుగా భూమి మీద వున్నా మనము క్షణమాత్రములో ఆ మహిమ దేహములు దరిస్తాము. (1 థెస్స  4:13-18). ఈ శరీరాలు మరణం లేనివి, రోగాలు రానివి.  (1 కొరింతి   15:42), మహిమకరమైన, శక్తివంతమైన వి  (1 కొరింతి  15:43), మరియు ఆత్మీయమైనవి.  (1 కొరింతి  15:44). 
     ఈ శరీరాలతో మనం దేవుని యొద్ద పరలోకములో యుగయుగములు ఉండబోతున్నాము. 
 (2 తిమోతి  2:10)(1 పేతురు  5:10)(2 కోరితి  4:17). 
     అంతేకాకుండా పాపములేని, ఏడ్పులేని, బాధలేని, దుఃఖములేని పర లోకములో మనముండబోతున్నాము.  (ప్రకటన  21:27)(ప్రకటన  22:15). (ప్రకటన  21:4).
     యేసుక్రీస్తు చనిపోయి, మూఢవ రోజున తిరిగిలేచిన తర్వాత పరలోకానికి వెళ్లబోయే ముందు అయన 40 రోజులు భూమి మీద  గడిపాడు.  (అపో  1:3) . దీనిని పునరుత్థానము అంటారు. ఈ సమయములో అయన మహిమ దేహముతో ఉన్నాడు. బైబిల్ చెప్తుంది మృతులలోనుండి ప్రథముడిగా తిరిగి లేచింది యేసు మాత్రమే.           (1 కొరింతి  15:20) తర్వాత మనము.     
     కాబట్టి క్రిస్తవ విశ్వాసానికి ముఖ్యమైనది యేసుక్రీస్తు పునరుత్థానము. యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి అయన ద్వారా మనం కూడా ఒకరోజు మరణమును జయిస్తాము. 
 (యోహాన్  14:19)(1 కొరింతి  6:14)(రోమా  8:11).
    నీవు నిజంగా క్రైస్తవుడవైతే ఈ వాగ్దానమును నమ్ము. (ఫిలిప్పు  1:6) మీలో ఈ సత్క్రియ ఆరంబించినవాడు యేసుక్రీస్తు రాకడ వరకు దీనిని కొనసాగించును. 
     నీవు క్రైస్తువుడవు కాకపోతే యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ పొంది అయన అనుగ్రహించు రక్షణను పొందుము. అప్పుడు నీవు  నిత్యత్వము వరకు అయనతో సదాకాలము మహిమ శరీరములతో జీవించగలము. 
                                         దేవుని స్తోత్రములు 

Friday, 12 August 2016

యూదా, ఇశ్రాయేలు రాజులు ఎందరు?ఎన్ని సంవత్సరాలు పాలించారు? వారిలో మంచి వారు ఎందరు? చెడ్డవారు ఎందరు?  


    మొత్తం 42 మంది రాజులు (ఒక రాణి కూడా వుంది)  . సౌలు మొదటి రాజు,  అతను ఇశ్రాయేలు 12 గోత్రాలను 40 సంవత్సరాల పాటు పరిపాలించాడు.   సౌలు మరణం తర్వాత రాజ్యం తాత్కాలికంగా రెండు గా విడిపోయింది.  సౌలు కుమారుడు ఇష్బోషెతు ఇశ్రాయేలు 11 గోత్రాలను 2 సంవత్సరాలపాటు పరిపాలించాడు.  అదే విదంగా యూదాను దావీదు పరిపాలించాడు. ఇష్బోషెతు హత్య గావించబడిన తర్వాత దావీదు 12 గోత్రాలమీద రాజుగా ఉన్నాడు.  అతని కుమారుడైన సొలొమోను కూడా ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజుగా ఉన్నాడు. డేవిడ్, సొలొమోను ఇద్దరు చెరో 40 సంవత్సరాల పాటు పరిపాలించారు.  
     సొలొమోను తర్వాత రాజ్యం రెండుగా విడిపోయింది.  దక్షిణ రాజ్యము  (యూదా, బెన్యామీను గోత్రాలు దీన్నే యూదా రాజ్యము అంటారు ) ఉత్తర రాజ్యము (మిగిలిన 10 గోత్రాలు దీన్నే ఇశ్రాయేలు అంటారు). దీని ఫలితమే యూదాను 19 రాజులు, ఒక రాణి పాలించారు. ఇశ్రాయేలును 19 మంది రాజులు పాలించారు. క్రింది పట్టిక చూడండి. బ్రాకెట్లలో ఉన్నవి పరిపాలించిన సంవత్సరాలు. 
ఇశ్రాయేలు రాజులు యూదా రాజులు 
1. యరొబాము  1 (22 yrs)1. రెహోబాము (17 yrs)
2. నాదాబు  (2 yrs)2. అబీయా  (3 yrs)
3. బయెషా  (24 yrs)3. ఆసా  (41 yrs)
4. ఏలా  (2 yrs)4. యెహోషాపాతు  (25 yrs)
5. జిమ్రి  (7 days)5. యెహోరాము  (8 yrs)
6. ఒ మ్రి  (12 yrs)6. అహజ్యా  (1 yr)
7. అహాబు  (22 yrs)7. అతల్యా రాణి  (6 yrs)
8. అహజ్యా  (2 yrs)8. యోవాషు (40 yrs)
9. యెహోరాము (12 yrs)9. అమజ్యా  (29 yrs)
10. యెహూ  (28 yrs)10. అజర్యా (ఉజ్జియా )(52 yrs)
11. యెహోయాహాజు  (17 yrs)11. యోతాము  (16 yrs)
12. యెహోయాజు  (16 yrs)12. ఆహాజు  (16 yrs)
13. యరొబాము  2 (41 yrs)13. హిజ్కియా  (29 yrs)
14. జెకర్యా  (6 నెలలు )14. మనష్షే  (55 yrs)
15. షల్లూము  (1 నెల )15. ఆమోను  (2 yrs)
16. మనహేము  (10 yrs)16. యోషీయా  (31 yrs)
17. పెకహ్యా  (2 yrs)17. యెహోయాహాజు  (3 నెలలు )
18. పెకహు  (20 yrs)18. యెహోయాకీము  (11 yrs)
19. హోషేయా  (9 yrs)19. యెహోయాకీను  (3 నెలలు )
20. సిద్కియా (11 yrs)
     ఈ పట్టిక ప్రకారము ఇశ్రాయేలు రాజులందరూ చెడ్డవారు.  యూదా రాజులలో 8 మంది మంచివారు మిగతా 12 మంది చెడ్డవారు.   (ఆసా, యెహోషాపాతు, యోవాషు, అమజ్యా, అజర్యా ,యోతాము, హిజ్కియా, మరియు యోషీయా )
    

Thursday, 11 August 2016

యేసుక్రీస్తు ప్రభువు వారు భూమిమీద మనిషిగా  వున్నప్పుడు ఏమైనా పాపం చేశాడా?


    ఆయన పాపం చేసాడు అని ఎవరైనా అంటే నేనైతే  నమ్మను. ఎందుకో వివరిస్తాను.  మనం మొదటిగా ఒకటి తెలుసుకోవాలి, యేసుక్రీస్తు వారు సంపూర్ణ మనిషి అలాగే  సంపూర్ణ దేవుడు.  అయన మనిషిగా మారినప్పటికీ అయన దేవుడుగా కూడా వున్నాడు.  (కొలొస్స  2:9)(ఫిలిప్పు  2:5-8). దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు,  ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడునేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.  (యాకోబు  1:13), కాబట్టి యేసు పాపము విషయమై శోదించబడలేదు, ఎందుకంటే ఆయన దేవుడు. 

     దీన్ని ఇంకొంచం వివరంగా తెలుసుకుందాం.  యేసుక్రీస్తు వారు కూడా శోదించబడ్డారని మనకు తెలుసు. (హెబ్రీ  2:18)(హెబ్రీ  4:15).  ఈ శోధనను గురించిన వివరణ మనకు (మత్త  4:1-11)లో కనిపిస్తుంది.  శోధకుడు (సాతాను) యేసును శోధించడానికి అరణ్యానికి తీసుకెళ్లాడు.  సాతాను యేసును మూడు విధాలుగా శోదించాడు.  1యోహాను  2:16 లో చెప్పబడిన విదంగా మనుషులందరూ శరీరాశ (మత్తయి  4:1-4) నేత్రాశ (మత్త  4:8-11) జీవపు డంబము (మత్త  4:5-7) అను మూడు  విషయములో శోదించబడతారు.  యేసు శోధనలకు  లొంగిపోలేదు కానీ ద్వితీయోపదేశ కాండము లోని వచనాలు ద్వారా "ఇలా  రాయబడినది, ఇలా రాయబడినది" అని సమాధానమిచ్చి శోధనను జయించాడు.  
     యేసు శోదించబడినను ఆయన పాపము లేని వాడిగా భూమి మీద జీవించాడు.  (2 కొరింతి  5:21)(1 పేతురు  2:22)(1 యోహాను  3:5), శోదించబడడం పాపం కానేకాదు. యేసు భూమి మీద ఉన్నపుడు మనలాగే శరీర విషయాల మీద శోదించబడ్డాడు.  ఎప్పుడైతే మనము ఒక శోధన గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటామో, అప్పుడు ఆ శోధన మనకు పాపంగా మార్చబడుతుంది.   (యాకోబు  1:15-16). యేసు "దేవుడు" కాబట్టి అయన ఎలాంటి  బాహ్య శోధనకు తావివ్వలేదు. 
     దీన్ని అర్ధం చేసుకోవడానికి ఒక ఉదాహరణను ఇక్కడ ఇస్తున్నాను. రకరకాల ప్రజలు రకరకాల  శోధనలకు లొంగిపోతారని మనకు తెలుసు. కరక్టే కదా! ఒక స్త్రీ "బికినీ" దుస్తులు ధరించి ఉంది అనుకోండి.  ఈమెను ఇంకొక స్త్రీ  చూసింది. ఈ రెండవ స్త్రీ ఆ "బికినీ" ధరించిన మొదటి స్త్రీని చూసి ఏమైనా శోదించబడుతుందా? ఏమాత్రం శోదించబడదు. (ఒకవేళ ఆమె హోమోసెక్సుల్ అయితే తప్ప ). ఇదే స్త్రీని ఒక పురుషుడు చూస్తే శోధనకు గురై , పాపపు తలంపులు వచ్చే  అవకాశాలు చాలా ఎక్కువ. ఇదే విషయాన్ని మనం అనేక పరిస్ధితుల  మీద  ఆలోచించవచ్చు. ఒక స్మోకర్ సిగరెట్ ను చూసిన, లేక సిగరెట్ పొగ వాసన పీల్చినా శోదించబడతాడు , ఇదే సిగరెట్,  స్మోకింగ్ అలవాటు లేని వాడిమీద ఎలాంటి ప్రభావం చూపించలేదు.  మత్తు పానీయాలు కూడా కొందరికి శోధన, కొందరిని  ప్రభావితం చేయలేవు. 
    యేసుక్రీస్తు విషయములో కూడా ఇది చాలా కరెక్ట్. అనేక శోధనలు అయన మీదకు వచ్చాయి. కానీ అవేమి ఆయను ప్రభావితం చేయలేక పోయాయి.  వాటికి అంతరంలో అయన చనిపోయాడు.  సాతానుకు యేసుక్రీస్తు వారి మీద ఎలాంటి అధికారం లేదు. (యోహాను  14:30). యేసుక్రీస్తు వారి యొక్క ఒకే ఒక ఆశ "తండ్రి యొక్క చిత్తం చేయడం ద్వారా తండ్రిని  సంతోషపరచటం".  (మత్త  26:39)(లూకా  22:42)(యోహాను  4:34)(యోహాను 5:30)(యోహాను 6:38)(యోహాను 8:29). మనకు కూడా ఇలాంటి ఆశ ఉంటే మనం కూడా పాపానికి ఎలాంటి చోటు ఇవ్వకూడదు. 

పునర్జన్మ అంటే ఏమిటి? దీనికి బైబిల్ ఏమి చెప్తుంది. 


     
పునర్జన్మ అనేది హిందూ మతములోను, బౌద్ధ మతములోను చెప్పబడిన ఒక విశ్వాసం. దీని ప్రకారం ఒక మనిషి చనిపోయిన తర్వాత వారి యొక్క ప్రాణం లేక ఆత్మ వేరే క్రొత్త దేహం లోనికి ప్రవేశిస్తుంది.  అది మనిషి కావచ్చు, పక్షులు, జంతువులైన కావచ్చు. ఆ కారణాన వారు వేరే జంతువులను చంపడానికి అంగీకరించరు. ఎందుకంటే అది ముందు ముందు మనమే కావచ్చు అని. నీవు ఏమైతావు అనేది నీవు చేసిన పనులు మీద ఆధారపడుతుంది అని వీరు నమ్ముతారు.  దీనినే "కర్మ" అంటారు. కర్మ అంటే మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది. చెడు పనులు చేస్తే శిక్షింపబడతావు. 
నీవు బ్రతికి వున్నప్పుడు ఎక్కువ చెడు  పనులు చేస్తే లేక  మంచి పనులు కన్నా చెడు  పనులు ఎక్కువగా ఉంటే నీవు క్రిందిస్థాయి జాతిలో తిరిగి జన్మిస్తావు. ఈరకంగా ఒక మనిషి పాప  విముక్తి పొందేవరకు అనేక జన్మలు ఎత్తి  "నిర్వాణం" అనే "అత్యధికమైన సంతోష స్థితికి" చేరుకుంటాడు.  దీనినే దేవునిలో ఐక్యమవడం అంటారు.   
     కానీ ఇది వాక్యానుసారమా? కాదు,  కానేకాదు 
     ముఖ్యమైన కారణమేమంటే ఇది యేసుక్రీస్తు వారి మరణ భూస్థాపన పునరుత్తానాలను నిరుపయోగముగా చేస్తుంది.  యేసుక్రీస్తు మన పాపములకొరకు సిలువ మీద చనిపోయాడు. అయన రక్తమువలన మనము పరిశుద్ధులమైనాము.  (మత్త  26:28)(రోమా  5:8-9)(కొలొస్స  1:14)(1 యోహాను  1:7) నీతిమంతులముగా తీర్చబడ్డాము.  (2 కొరింతి  5:21)(ఫిలిప్పు  3:9)(రోమా  3:21-22).  మనము యేసు చేసిన సిలువ కార్యము నందు విశ్వాసముంచి, ఆయనను అంగీకరించితే మనం నిత్యం దేవునితో ఉంటాము. అలాగే యేసుక్రీస్తు సిలువయందు విశ్వాసముంచని వారు, అయన చేసిన బలియాగమును నమ్మనివారు దేవునికి దూరంగా సదా కాలము నరకములో వుంటారు.  
     పునర్జన్మ అనేది బైబిల్ బోధనలను రద్దు పరుస్తుంది. పాపములను రద్దుపరచుటకు యేసు చేసిన క్రయానికి బదులు,  తర్వాత జన్మలో పాపములు అనుభవించాలని చెప్తుంది(కర్మ). మనమందరమూ ఒక్కసారే మరణించాలి తర్వాత ఇంకొక జన్మ లేదని బైబిల్ చెప్తుంది.  ప్రతి ఒక్కరం ఒక్కసారే మరణించాలి.  (యోబు  14:14), తర్వాత మనకు తీర్పు విధించబడుతుంది. (హెబ్రీ  9:27). క్రైస్తవులందరూ  ఒకసారి ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత సదా కాలము స్వర్గములో దేవునితో ఉంటారు  (2 కొరింతి  5:8)(ఫిలిప్పు  1:23).  క్రీస్తుని అంగీకరించని  వారందరు చనిపోయిన తర్వాత నరకములో నిత్యశిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని యేసుక్రీస్తు చెప్పినది ఖచ్చితంగా నిజము . (మత్త  25:46)(దానియేలు  12:2)(2 థెస్సలొ  1:8-9)(యోహాను  5:29) . అది దేవునితో నిత్యా ఎడబాటు. పునర్జన్మ అనేది నరకమును నమ్మదు .  
      మనం పరలోకం నుండి రాలేదు మనము మట్టితో చేయబడ్డాము కాబట్టి భూసంబంధులం.    (యోహాను  3:31)(యోహాను 8:23)(ఆది  3:19)(ఆది  2:7) అలాగే ముందుగా  మన శరీరాలు చేయబడ్డాయి తర్వాత ఆత్మ దానిలోనికి ప్రవేశపెట్టబడినది.  (1 కొరింతి  15:46-47)(జెకర్యా  12:1)(యెషయా  42:5).
   
     కొంతమంది యేసుక్రీస్తు తిరిగి లేవడాన్ని, లాజరు తిరిగి బ్రతికించబడడాన్ని పునర్జన్మగా చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించండి వాళ్ళు తిరిగి వాళ్ళ శరిములతో లేచారు కానీ వేరే వాళ్ళ శరీరాలలోనికి వెళ్ళలేదు.
     

Wednesday, 10 August 2016

లూసిఫర్ ఎవరు?



    లూసిఫర్ (అంటే కాంతిని ధరించినవాడు లేక ఉదయ నక్షత్రం అని అర్ధం) అనే పదం బైబిల్ అంతటిలో ఒకేసారి ఉపయోగించబడింది. (యెషయా 14:12).  (యెషయా  14:12-17) లోని  వచనాలు బబులోను రాజునూ గురించి వర్ణించబడినప్పటికీ  అనేక మంది అవి సాతానుకు కూడా వర్తిస్తాయని  భావిస్తున్నారు. ఇవే వచనాలను  (యెహెఙ్కేలు 28:11-17) లోని (తూరు రాజుతో పోలిస్తే ) అవి కూడా సాతానుకు వర్తిస్తాయి. ఇక్కడ మనకు సాతాను యొక్క పతనం కనబడుతుంది. (ఇవి కూడా చూడండి. లూకా  10:18, ప్రకటన  12:8-10)
     సాతాను యొక్క పతనం ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు కానీ  దేవుడు ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత జరిగి ఉండవచు. (అతడు పడిపోవడానికి ముందు ఏదెను తోటలో ఉన్నాడు    యెహెఙ్కేలు28:13). ఏదిఏమైనప్పటికీ  ఆదాము సృష్టించబడక ముందే ఏదెను తోటలో ఉన్నాడని చెప్పవచ్చు ఎందుకంటే ఆ తోటలోనే అవ్వను మోసపరచాడు. (ఆది  3).
     పరలోకం నుండి తోయబడిన తర్వాత లూసిఫర్ పేరు "విరోధి" గ మార్చబడింది. 
     సరే ఇప్పుడు చదవబోయేదంతా ఊహ మాత్రమే సత్యం కాదు.  కొంతమంది ఏమి నమ్ముతారంటే లూసిఫర్ ముగ్గురు ప్రధాన దూతలలో ముఖ్యుడు లేదా మిగతా దూతలకు నాయకుడు.(మిఖాయేలు,గాబ్రియేలు అనేవారు మిగతా ఇద్దరు) మిఖాయేలు ముఖ్యమైన భద్రత (guardian angel) విషయాలు చూస్తాడు. గాబ్రియేలు ముఖ్యమైన సందేశాలు తీసుకెళ్తాడు. లూసిఫర్ ముఖ్యమైన ఆరాధన నాయకుడు. ఇది లూసిఫర్ ను గురించిన కొంత వివరణ. (యెహెఙ్కేలు 28:13 ప్రకారం) తంబూరాలు, పైపులు మొదలైన వాద్యపరికరాలు ఆయనలో ఇమిడివున్నవి లేక అయన శరీరములో భాగాలు కావచ్చు. 
     కొంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే  దేవుడు యోబుతో మాట్లాడుతూ "ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు"  అని యోబు 38:4-7 లో చెప్పాడు. వీరు ఎవరు? ఇక్కడ బహువచనం వాడబడినది (ఉదయనక్షత్రములు అని )   లూసిఫర్ పేరు ఉదయనక్షత్రం . యేసుక్రీస్తు వారు కూడా ఉదయనక్షత్రం అని పిలిచారు. (ప్రకటన 22:16)(ప్రకటన 2:28). కానీ యోబులో చెప్పబడిన "ఉదయనక్షత్రములు" ఎవరు? Smile.
     కాబట్టి ఇది ఒక ఊహ. నిజమో కాదు. దీన్ని గురించి ఎక్కువ ఆలోచించవద్దు. 
     

 అన్ని పాపాలు అన్ని  దేవుని దృష్టిలో ఒకటే . ఇది కరెక్టేనా?


కాదు కానేకాదు అన్ని పాపలు ఒకటి  కాదు!!. 
     దాదాపుగా ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గురించే ఏదో ఒక సందర్బములో మాట్లాడే ఉంటారు. అంతేకాక దీన్ని ప్రతి ఒక్కరు నమ్ముతారు. అయితే "పాపము అంతా ఒకటే" అని బైబిల్ లో ఎక్కడ చెప్పబడలేదు.  అబద్ధికుడిని , నరహంతకుడిని దేవుడు ఒకేలా చూస్తాడనుకోవడం కరెక్ట్ కాదు.  దేవుడు దేన్ని  ఎక్కువ  నీచంగా చూస్తాడు? హిట్లర్ ఒక లక్ష మందిని మోసం చేసాడు అనేదాన్న? లేక హిట్లర్ లక్ష మందిని చంపాడు అనేదాన్న? 
     బైబిల్ లోనుండి కొన్ని ఉదాహరణలు చూద్దాం. 
    పాతనిబంధనలో దొంగతనానికి దేవుడు ఏమి శిక్ష విధించాడు?  నష్టపరిహారం (నిర్గ  22:1-4)
(లేవి  6:2-5)(2 సమూ  12:6). దొంగిలించిన దానితో వడ్డీ కలిపి చెల్లించాలి.  మరి ఒక వ్యక్తిని చంపినా నరహంతకుడికి దేవుడు ఏమి శిక్ష విధించాడు?  ఆ నరహంతకుడిని కూడా చంపివేయాలి. 
(నిర్గ  21:12-14,23-25)(సంఖ్యా  35:16-21,29-31)(ఆది  9:6).
    ఒకవేళ రెండు పాపాలు ఒకటే అయితే శిక్షలు కూడా ఒకేలా ఉండాలి గదా? మరి ఒక దానికి నష్టపరిహారం మరియొక దానికి మరణశిక్ష ఎందుకు చెప్పాడు? కాబట్టి దేవుడు దొంగని, నరహంతకుడుని ఒకేలా చూడడు అని మనకు పై వచనాలు ద్వారా అర్థం అవుతుంది. 
     ఇంకా కొన్ని పాపములను గురించిన వచనాలను చూద్దాం. 
(యెహెఙ్కేలు 8:6,13,15) ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు యొక్క పాపాల జాబితాను గురించి మాటలాడుచున్నాడు. ఈ పాపాల జాబితా ఒకదాని మించి మరొకటి వుంది. 

(యోహాను  19:11)(యేసు పిలాతుతో చెప్పాడు) నీకు పైనుండి అనుగ్రహించబడితేనే గాని నామీద ఎలాంటి అధికారం లేదు.  నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. 

(యాకోబు  3:1నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి.  (తప్పుడు బోధకులకు)
( యెహెఙ్కేలు16:52నీవు వారికంటె అత్యధికముగా హేయక్రియలు జరిగించినందున నిన్నుబట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు; నీవు వారికి విధించిన అవమానశిక్ష నీకే రావలెను; నిన్నుబట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు గనుక నీవు అవమానపరచబడి సిగ్గునొందుము. 
     నరకములో కూడా కొంతమందికి  మిగతావారి కంటే అధికమైన శిక్షలు విధించబడతాయి. ఎందుకని? దేవుడు అన్ని పాపాలు సమానంగా చూసినప్పుడు కొందరికి అధికమైన శిక్షలు ఎందుకు? 
(లూకా  12:47-48)  ఏ సేవకుడు తన యజమానుని యొక్క చిత్తమెరిగి, సిద్దపడక , అయన చిత్తము చొప్పున చేయకుండా ఉండునో ఆ సేవకునికి అధికమైన దెబ్బలు తగులుతాయి.   (48) అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవానికి కొద్ది దెబ్బలే తగులునుఎవనికి ఎక్కువగా ఇయ్య బడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా పొందజూతురు.  
(యిర్మీయా  16:18)వారు తమ హేయదేవతల కళేబరములచేత నా దేశమును అపవిత్ర పరచియున్నారు, తమ హేయక్రియలతో నా స్వాస్థ్యమును నింపియున్నారు గనుక నేను మొదట వారి దోషమును బట్టియు వారి పాపమును బట్టియు రెండంత లుగా వారికి ప్రతికారము చేసెదను.  
(మార్కు  12:40విధవరాండ్ర యిండ్లు దిగమిం గుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను. 
(ఆది  4:15)  అందుకు యెహోవా అతనితోకాబట్టి యెవడైనను కయీనును చంపినయెడల వానికి ప్రతిదండన యేడంతలు కలుగుననెను.
(హెబ్రీ  10:29) ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును? 
(మత్తయి  11:24)  విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.
(యెషయా  40:2యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు శిక్ష పొందెను.  
(యిర్మీయా  17:18)  రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయుము అని యిర్మీయా అడుగుచున్నాడు. 
ఎందుకు దేవుడు కొన్ని పాపములను "హేయకృత్యములు" అని అంటున్నాడు? అంటే అన్ని పాపములు ఒకటి కాదు అని అర్ధం. 
     
        ఒక విదంగా చూస్తే పాపాలన్నీ సమానమే. నరహత్య చేస్తే ఏవిదంగా  పరలోకం వెళ్ళలేమో  అబద్దం ఆడిన కూడా పరలోకం వెళ్లలేము. ఏ పాపి కూడా పరలోకం వెళ్ళలేడు . దొంగ అయినా అబద్ధికుడైన, నరహంతకుడైన ఎవరైనా సరే వెళ్ళలేరు. పరలోకం వెళ్లాలంటే మనం పరిపూర్ణులం కావాలి. కానీ మనమెప్పటికీ పరిపూర్ణులం కాలేము. అందుచేతనే మనకు యేసుక్రీస్తు కావాలి.  యేసు  పరిపూర్ణ జీవితం జీవించాడు.  కాబట్టి ఎప్పుడైతే మనం మారుమనస్సు పొందుతామో అప్పుడు ఆయన యొక్క పరిపూర్ణత మనకు అనుగ్రహించబడుతుంది. అయన రక్తము మన దోషములను కప్పివేస్తుంది. మరియు దేవుడు మనలను పరలోకానికి అంగీకరించేటట్లు చేస్తుంది.
     మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే , ఏ పాపమైన సరే మనలను దేవునికి  దూరం చేస్తుంది.  అది దేవునితో మనకున్న ఐక్యతను పాడుచేయలేదు కానీ దేవునితో మనకున్న సహవాసమును పాడుచేస్తుంది. అందుకనే మన పాపముల విషయమై మనం పశ్చాత్తాపపడి, వాటిని ఒప్పుకొని ప్రభువుతో మన సహవాసమును కొనసాగించాలి.   .