పునర్జన్మ అంటే ఏమిటి? దీనికి బైబిల్ ఏమి చెప్తుంది.
పునర్జన్మ అనేది హిందూ మతములోను, బౌద్ధ మతములోను చెప్పబడిన ఒక విశ్వాసం. దీని ప్రకారం ఒక మనిషి చనిపోయిన తర్వాత వారి యొక్క ప్రాణం లేక ఆత్మ వేరే క్రొత్త దేహం లోనికి ప్రవేశిస్తుంది. అది మనిషి కావచ్చు, పక్షులు, జంతువులైన కావచ్చు. ఆ కారణాన వారు వేరే జంతువులను చంపడానికి అంగీకరించరు. ఎందుకంటే అది ముందు ముందు మనమే కావచ్చు అని. నీవు ఏమైతావు అనేది నీవు చేసిన పనులు మీద ఆధారపడుతుంది అని వీరు నమ్ముతారు. దీనినే "కర్మ" అంటారు. కర్మ అంటే మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది. చెడు పనులు చేస్తే శిక్షింపబడతావు.
నీవు బ్రతికి వున్నప్పుడు ఎక్కువ చెడు పనులు చేస్తే లేక మంచి పనులు కన్నా చెడు పనులు ఎక్కువగా ఉంటే నీవు క్రిందిస్థాయి జాతిలో తిరిగి జన్మిస్తావు. ఈరకంగా ఒక మనిషి పాప విముక్తి పొందేవరకు అనేక జన్మలు ఎత్తి "నిర్వాణం" అనే "అత్యధికమైన సంతోష స్థితికి" చేరుకుంటాడు. దీనినే దేవునిలో ఐక్యమవడం అంటారు.
కానీ ఇది వాక్యానుసారమా? కాదు, కానేకాదు
ముఖ్యమైన కారణమేమంటే ఇది యేసుక్రీస్తు వారి మరణ భూస్థాపన పునరుత్తానాలను నిరుపయోగముగా చేస్తుంది. యేసుక్రీస్తు మన పాపములకొరకు సిలువ మీద చనిపోయాడు. అయన రక్తమువలన మనము పరిశుద్ధులమైనాము. (మత్త 26:28)(రోమా 5:8-9)(కొలొస్స 1:14)(1 యోహాను 1:7) నీతిమంతులముగా తీర్చబడ్డాము. (2 కొరింతి 5:21)(ఫిలిప్పు 3:9)(రోమా 3:21-22). మనము యేసు చేసిన సిలువ కార్యము నందు విశ్వాసముంచి, ఆయనను అంగీకరించితే మనం నిత్యం దేవునితో ఉంటాము. అలాగే యేసుక్రీస్తు సిలువయందు విశ్వాసముంచని వారు, అయన చేసిన బలియాగమును నమ్మనివారు దేవునికి దూరంగా సదా కాలము నరకములో వుంటారు.
పునర్జన్మ అనేది బైబిల్ బోధనలను రద్దు పరుస్తుంది. పాపములను రద్దుపరచుటకు యేసు చేసిన క్రయానికి బదులు, తర్వాత జన్మలో పాపములు అనుభవించాలని చెప్తుంది(కర్మ). మనమందరమూ ఒక్కసారే మరణించాలి తర్వాత ఇంకొక జన్మ లేదని బైబిల్ చెప్తుంది. ప్రతి ఒక్కరం ఒక్కసారే మరణించాలి. (యోబు 14:14), తర్వాత మనకు తీర్పు విధించబడుతుంది. (హెబ్రీ 9:27). క్రైస్తవులందరూ ఒకసారి ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత సదా కాలము స్వర్గములో దేవునితో ఉంటారు (2 కొరింతి 5:8)(ఫిలిప్పు 1:23). క్రీస్తుని అంగీకరించని వారందరు చనిపోయిన తర్వాత నరకములో నిత్యశిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని యేసుక్రీస్తు చెప్పినది ఖచ్చితంగా నిజము . (మత్త 25:46)(దానియేలు 12:2)(2 థెస్సలొ 1:8-9)(యోహాను 5:29) . అది దేవునితో నిత్యా ఎడబాటు. పునర్జన్మ అనేది నరకమును నమ్మదు .
మనం పరలోకం నుండి రాలేదు మనము మట్టితో చేయబడ్డాము కాబట్టి భూసంబంధులం. (యోహాను 3:31)(యోహాను 8:23)(ఆది 3:19)(ఆది 2:7) అలాగే ముందుగా మన శరీరాలు చేయబడ్డాయి తర్వాత ఆత్మ దానిలోనికి ప్రవేశపెట్టబడినది. (1 కొరింతి 15:46-47)(జెకర్యా 12:1)(యెషయా 42:5).
కొంతమంది యేసుక్రీస్తు తిరిగి లేవడాన్ని, లాజరు తిరిగి బ్రతికించబడడాన్ని పునర్జన్మగా చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించండి వాళ్ళు తిరిగి వాళ్ళ శరిములతో లేచారు కానీ వేరే వాళ్ళ శరీరాలలోనికి వెళ్ళలేదు.

No comments:
Post a Comment